తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు నియామకం

k-keshava-rao-appointed-as-telangana-government-advisor

హైదరాబాద్‌ః ఇటీవలే కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజా వ్యవహారాల సలహాదారుగా కేశవరావు కొనసాగుతారు. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేకే గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకడ్‌తో కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేకే పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉంది. దీంతో పీసీసీ చీఫ్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు, ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్‌ రాని సీనియర్‌ నేతలు ఆ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయినా వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీకి సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

కాగా, గతేడాది (2023) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడంతో పరిణామాలన్నీ మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీ కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ.. ఘర్ వాపసు అంటోంది. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను పార్టీలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పెద్దలు కేకేతో చర్చలు జరిపారు. గతంలో హైదరాబాద్ మేయర్‌గా ఉన్న ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి పార్టీలో చేరారు. ఈ సమయంలో కేకే కూడా పార్టీలో చేరతారని అందరూ భావించారు. అయితే కెకె అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పెద్దపీట వేసింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. మరికొందరు చేరే అవకాశం ఉంది.