నేటి నుండి విధుల్లో చేరనున్న జూనియర్‌ డాక్టర్లు

Junior doctors who will join duty from today

కోల్‌కతా : నేటి నుండి కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు విధుల్లో చేరనున్నారు. జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార సంఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ … వైద్య విద్యార్థులు 41 రోజులుగా నిరసనలను కొనసాగించారు. ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత ఆందోళన విరమించారు. నేటి నుంచి అత్యవసర వైద్య సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంతో రెండు సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో జూనియర్‌ వైద్యులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారి పలు డిమాండ్లకు సిఎం అంగీకరించారు. కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్‌ కుమార్‌ వర్మను నియమించారు. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కౌస్తవ్‌ నాయక్‌, హెల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ దేవాశిష్‌ హల్దేర్‌లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు.

అనంతరం రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌తో బుధవారం సమావేశమయ్యారు. జూనియర్‌ డాక్టర్లు మాట్లాడుతూ … తమ ఆందోళన విరమిస్తున్నామన్నారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు రేపు మధ్యాహ్నం సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపట్టనున్నామని ప్రకటించారు. వరదల నేపథ్యంలో రోగులకు వైద్యం అందించడానికి శనివారం నుంచి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. అత్యవసర సేవల్లో పాల్గొంటామని తెలిపారు. అయితే అన్ని కోల్‌కతాలోని వైద్య కళాశాలల వద్ద ధర్నా మంచాస్‌ అలాగే కొనసాగుతాయని ఓ డాక్టర్‌ స్పష్టం చేశారు.