సమ్మె విరమించిన జూడాలు

వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన జూడాలు.. సోమవారం నుంచి ఓపీ, ఎలక్టివ్ సర్జరీలను సైతం బహిష్కరించి సమ్మెబాట పట్టారు. వైద్యారోగ్య శాఖ మంత్రితో జరిపిన చర్చలు అసంపూర్ణం కాగా.. డీఎంఈతో చేసిన చర్చలు సైతం విఫలం కావటంతో సమ్మె ఉద్ధృతం చేశారు.అయితే మంగళవారం రాత్రి మరోసారి డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జూడాల చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పలు హామీల అమలుకు ప్రభుత్వం వాగ్దానం చేయడంతో సమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.

ప్రభుత్వ హామీ నేతపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా నిపివేస్తున్నట్లు జూడాలు తెలిపారు. జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాల్లోని జూడాలతో చర్చలు జరపనున్నారు. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.