పోలీసుల విచారణకు జోగి రమేశ్ గైర్హాజరు

Jogi Ramesh did not attend the police investigation

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ పలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో పోలీసుల విచారణను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఒక పర్యాయం పోలీసుల విచారణకు హజరైన ఆయన .. మంగళవారం మరోసారి విచారణకు రావాల్సి ఉండగా, గైర్హాజరయ్యారు. జోగి రమేశ్ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని వివరణ ఇచ్చారు. విచారణకు రమేశ్ రావడం లేదని ఆయన తరపు న్యాయవాదులు తెలియజేశారు.

గత శుక్రవారం నాడు జోగి రమేశ్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరవ్వగా, గంటన్నర పాటు విచారణ చేసి పంపించి వేశారు. అయితే ఈ కేసులో మరోసారి విచారణకు మంగళవారం హజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయనను అరెస్టు చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ కేసులో జోగి రమేశ్ అభియోగాలు ఎదుర్కొంటుండగానే అగ్రిగోల్డ్ భూముల అక్రమ క్రయ విక్రయాల్లో ఆయన కుమారుడిని అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

తనపై ఉన్న రాజకీయ కక్షతోనే తన కుమారుడిని అరెస్టు చేశారని ప్రభుత్వంపై జోగి రమేశ్ విమర్శలు చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు ఇంటిపై దాడి కేసుతో పాటు అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో జోగి రమేశ్ పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతుండటం ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.