50,000 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్?

నేడు ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ‘ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ 9లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం’ అని సీఎం రేవంత్ ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు సమావేశంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారని అంటున్నారు.

ఇక మరికాసేపట్లో శాసనసభ ప్రారంభం కానుంది. అనంతరం కంటోన్మెంట్‌ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలపనున్నది. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగనున్నది. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24 బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా చర్చిస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆర్వోఆర్‌ కొత్త చట్టం తీసుకురానున్నారని సమాచారం. సమావేశాలకు పోలీసులు నాలుగు అంచెల కంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 25న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.