నేటితో ఆర్టికల్‌ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌

J&K marks 5th anniversary of Article 370 abrogation amidst heightened security and protest, BJP to hold rally

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈరోజు ‘ఏకాత్మ మహోత్సవ్‌’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్‌ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రఘటనలు పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కూడా అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించింది. భద్రతా బలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది.

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్దమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ, శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

కాగా, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అధికార బీజేపీ వేడుకలు నిర్వహించేందుకు సిద్దమైంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో అమర్నాథ్ యాత్రికులు భగవత్ క్యాంప్‌లో ఉండిపోయారు. ఇంకోవైపు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పట్టిష్టమైన భద్రత చర్యలు చేపట్టింది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టారు. ఆ కొద్ది రోజులకే ఆయన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలున్న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దాంతో ఆ ఆర్టికల్ రద్దు అయి నేటికి అయిదేళ్లు పూర్తి అయింది.

మరోవైపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాకాలు చేస్తుంది. అందులోభాగంగా ఆగస్ట్ 8వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. అనంతరం కొద్దిరోజులకే అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించనున్నదని తెలుస్తుంది. ఇంకోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అయితే ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారు.