తెలంగాణ డీజీపీగా జితేందర్‌ .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Jitender as Telangana DGP .. Govt issues orders

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా, పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌ 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత దిల్లీ సీబీఐలో.., 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.