తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గత రాత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ను నియమించారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు.

రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ కొనసాగారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు.

ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తూన్న సీపీ రాధాకృష్ణన్‌ను ఇప్పటివరకూ తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్​గా ఉన్న రమేష్‌ బైస్‌ను తప్పించింది. ఇక రాజస్థాన్‌ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్‌ హరిభావ్‌ కిషన్‌రావ్‌ బాగ్డేని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించింది.