పోచారం పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బిఆర్ఎస్ కు బై బై చెప్పి..కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ , ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. పోచారం పార్టీ మారడం సిగ్గుచేటు. లక్ష్మీ పుత్రుడు అని కేసీఆర్ అంటే.. ఆయన లంక పుత్రుడుగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక నిధులు పొందింది బాన్సువాడ నియోజకవర్గమే.. గత ప్రభుత్వంలో పోచారం ఎంతో లబ్ధి పొందారని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులకోసం ఆయన పార్టీ మారలేదు.. ఇసుక, క్రషర్ దందాల కోసం పోచారం పార్టీ మారారంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. అధికారం లేకపోతే ఆయన ఉండలేరా అంటూ ప్రశ్నించారు.

శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లి సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డికోరడం తో వెంటనే ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పోచారం తో పాటు ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ కు పోచారం అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపినా కేసీఆర్ పట్టుబట్టి మరీ ఒప్పించారు. నిజామాబాద్ లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ కొనసాగినా సొంత చరిష్మాతో బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాంటి నేత కాంగ్రెస్ లోకి వెళ్లడం బిఆర్ఎస్ కు భారీ నష్టం వాటిల్లినట్లైంది.

పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం విశేషం. ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో 2014-2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.