ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ ను నియమించాలనే డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి. అయితే నిన్న టీడీపీ అధిష్టానం వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతే కాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన కొద్దినెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జనసేన వైరా నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు కూడా అయిన సంపత్ నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు అని సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది.
ఇందులో ఆయన “వేరే కులం వాడు ముఖ్యమంత్రి కాకూడదా? మెజారిటీ సంఖ్య ఉన్న ప్రజలందరూ సరైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు అని ప్రశ్నించారు. తద్వారా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన పరోక్షంగా సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటికే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వరుసగా డిమాండ్లు చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలంటూ జనసేన నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ ఎలాగో సీఎం కాబోతున్నారంటూ తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ పెట్టిన ట్వీట్ పై ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది.