తిరుమల లడ్డు వివాదం ఫై జగన్ ఏమన్నారంటే..

నాల్గు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కాదు..దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వు తో తయారు చేసారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై యావత్ ప్రజానీకం ..జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దీనిపై జగన్ స్పందించారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టుకు , ప్రధానికి లేఖ రాస్తానని వెల్లడించారు. అన్ని నియమ నిబంధనలు, మూడుసార్లు టెస్టింగ్‌ల తరువాతే వచ్చే రిపోర్టు అనంతరం నెయ్యి లడ్డూ తయారికి వెళ్తుందని అన్నారు. గత టీడీపీ, వైసీపీ హయాంలో నెయ్యి ప్రమాణాలు లేవని టీడీపీ 16 సార్లు, వైసీపీ 18 సార్లు ట్యాంకర్లను తిరిగి పంపించిందని గుర్తు చేశారు. కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారంతో దారుణ అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల నుంచి , ప్రజల నిలదీతల నుంచి దృష్టిని మరల్చడానికి ఈ నాటకం వాడుతున్నారని ఆరోపించారు.

‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు. ముంబై నటి కేసు, IPSల సస్పెన్షన్, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలతో డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. విజయవాడ వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే బ్యారేజీ గేట్ల వద్దకు బోట్లు వదిలారని అంటున్నారు. ఇప్పుడు తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారు’ అని ఫైర్ అయ్యారు.