జగన్‌కు తప్పిన ప్రమాదం

ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి పెను ప్రమాదం తప్పింది. ఈరోజు ఆయన తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటన ఉన్న నేపథ్యంలో ఫ్లైట్‌లో కడప విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. జగన్ కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకేసారి స్లో కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈరోజు ఉ.11గం.కు ఏపీ అసెంబ్లీ స్పీకరుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం అయ్యారు. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు జగన్. అసెంబ్లీ కి రాకుండా జగన్ పులివెందులకు వెళ్లారు. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న తన నివాసం చేరుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.