వెనుక గేటు నుంచి అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం జగన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు నుంచి రెండ్రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకు ముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి జగన్ ప్రాంగణానికి చేరుకున్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రూటు మార్చి అమరావతి రైతుల శిబిరం వైపు రహదారి నుంచి కాకుండా వెనుక నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే తొలుత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జగన్ సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. గత ప్రభుత్వంలోని ఉపసభాపతి ఛాంబర్‌లోనే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి, ప్రొటెం స్పీకర్​కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్​కు వెళ్లిపోయారు.