బెంగళూరులో ఏ మూలకు వెళ్లినా మన తెలుగోళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ప్రస్తుతం సామాన్య ప్రజలు నివసించటానికి అందుబాటులో లేని నగరంగా మారిపోయింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమకు చెందిన ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ నగరంలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో టెక్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే క్రమంలో ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అధిక వేతనాలు అందుకుంటున్న టెక్కీలు బెంగళూరులో ఇంటి యజమానులు అడుగుతున్న భారీ అద్దెలకు అంగీకరించటంతో నగరంలో రెంట్స్ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంటి యజమానులు సైతం ఇష్టమెుచ్చినట్లు అద్దెలు అడగటం దానికి ఐటీ ఉద్యోగులు కూడా సానుకూలంగా ఉండటంతో అద్దెలు పెరుగుతూ పోతున్నాయని ఒక వ్యక్తి రెడిట్ ఫ్లాట్ ఫారమ్‌లో పోస్ట్ చేయటం వైరల్ అయ్యింది.

అయితే బెంగళూరు నగరంలో భారీగా అద్దెలు పెరగటంపై రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాట్లాడుతూ.. ఐటీ కారిడార్ సమీపంలో ఉద్యోగులకు సరసమైన అద్దెలకు ఇళ్లు అందుబాటులో లేకపోవటంతో నగరంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా అద్దెలు పెరుగుదలకు కారణంగా చెపుతున్నారు. నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు సంపాదిస్తున్న టెక్కీల నుంచి ఇంటి యజమానులు అద్దె రూపంలో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. దీని కారణంగా మెుత్తం నగరంలో అద్దెలు తారా స్థాయిలకు చేరుకుంటున్నాయని.. సాధారణ ఉద్యోగాలు చేస్తున్న ఆదాయ వర్గాలకు ఇది భరించలేని భారంగా మారిపోయిందని పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసేదేం లేక ఐటీ ఉద్యోగుల వల్ల పెరిగిన అద్దెలతో తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఎక్కువ అద్దెలకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపాడు.