చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 29 ఏళ్లు

చంద్రబాబు 1995, సెప్టెంబర్ 1న తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ సందర్భానికి నేటితో 29 ఏళ్లు పూర్తయ్యాయి. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఆయన అందుకున్నారు. 28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

29 ఏళ్ల కింద 1 సెప్టెంబర్, 1995, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అటుపై మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన బాబు, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ కు రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. దేశంలో మరే రాజకీయ నాయకునికీ లేని విధంగా, వైవిధ్యభరిత అవకాశాలు, సవాళ్లు ఎదుర్కొన్న ఆయన దాదాపు పదిహేనేళ్లు విపక్ష నేతగా, సుమారు అంతే కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.