గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేదా?: కిషన్‌ రెడ్డి

kishan-reddy

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరితో పాటు ఆయన సొంత జిల్లాలోనూ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండాను ఎగురవేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీ మాత్రమే అన్నారు. గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు పెద్దగా తేడా లేదని విమర్శించారు.

బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ అన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు 14 శాతం నుంచి 35 శాతానికి ఎగబాకిందన్నారు. ఇది సాధారణ విషయమేమీ కాదన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి… ఇప్పటి వరకు చేయలేదన్నారు. 8 నెలలు అవుతున్నా హామీలు అమలు కాలేదన్నారు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ మార్గంలోనే కాంగ్రెస్ వెళ్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.