టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి

టీటీడీ అదనపు ఈవోగా ఐఆర్ఎస్ అధికారి చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..అన్ని శాఖల్లో ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిన్సియర్, సీనియర్ అధికారులను టిటిడి బాధ్యతలలో నియమిస్తున్నారు.

ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈవోగా ఐఆర్ఎస్ అధికారి చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని ప్రభుత్వం నియమించింది. టీటీడీ జేఈఈవోగా నియమితులైన వెంకయ్య చౌదరి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్), విజయవాడ విభాగంలో కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా కూడా పనిచేశారు. 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన వెంకయ్య ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆయనను డిప్యుటేషన్పై ఏపీకి పంపింది. కాగా ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని టీడీడీ ఈవోగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.