భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్, కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీలను తొలగించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఎవాల్యూయేషన్ టెస్ట్ లో విఫలమైన కారణంగా ఈ ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఇన్ఫోసిస్ ఇటీవల ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్ నిర్వహణపై విమర్శలను ఎదుర్కొంటోంది. గతంలో కంపెనీ కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకున్నప్పటికీ, 2024లో చేరిన వారిలో దాదాపు సగం మంది ట్రైనీలను ఇప్పుడు తొలగించిన్నటు నివేదికలు సూచిస్తున్నాయి.

కంపెనీ తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారణం ఎవాల్యూయేషన్ టెస్ట్ లో వరుసగా మూడు సార్లు విఫలమవడం అని తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి టెర్మినేషన్ లెటర్లు జారీ చేసినట్లు సమాచారం. ట్రైనీలను బ్యాచ్‌ల వారీగా పిలిచి, లెటర్ పై సంతకం చేయమని అడిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తమ పేర్లు గోప్యంగా ఉంచాలని కోరుకున్న బాధితులలో ఒకరు, కంపెనీ ఉద్దేశపూర్వకంగా పరీక్షలను కఠినతరం చేసిందని ఆరోపించారు. ఈ ప్రక్రియ మొత్తం అన్యాయంగా ఉందని అన్నారు. 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా, ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా 2,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. 2022లో పట్టభద్రులైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందినా, ఆన్‌బోర్డింగ్‌లో డిలే జరిగింది.
ఈ డిలేకు సంబంధించి అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. చివరికి, ఏప్రిల్ 2024లో ఆ అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు, వారిలో సగం మందిని తొలగించడం ద్వారా ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటనపై ఇన్ఫోసిస్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.