ఎట్టకేలకు కరాచీ నేషనల్ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం, ఏదైనా మెగాటోర్నమెంట్ జరుగుతున్నప్పుడు, ఆ టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను ఆతిథ్య స్టేడియంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( పిసిబి) తొలుత ఈ నిబంధనను పాటించకపోవడం, ప్రత్యేకంగా భారత జెండాను ప్రదర్శించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.గడాఫీ స్టేడియంలో అన్ని దేశాల పతాకాలు కనిపించగా, భారత మువ్వన్నెల పతాకం మాత్రం కనిపించకపోవడం పై ఆసక్తి రేపింది. దాయాది దేశం కావాలనే పాక్ ఈ నిర్ణయం తీసుకుందా? లేదా అనుకోకుండా మరిచిపోయిందా? అన్న అనుమానాలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చకు వచ్చాయి. భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు, పలువురు రాజకీయ నాయకులు సైతం దీనిపై నిరసన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, క్రికెట్‌కి రాజకీయాన్ని ముడిపెడుతున్నదని విమర్శలు దారితీయడంతో పాక్ ఎట్టకేలకు దిగొచ్చింది.దీంతో నిన్న భారత పతాకాన్ని స్టేడియంపై ఏర్పాటు చేసింది.ఐసీసీ ఆదేశాలతో పాక్ దిగివచ్చి ఈ వివాదానికి ముగింపు పలికినట్టు తెలిసింది. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో నాలుగు జెండాలు మాత్రమే ఎగురవేయాలని ఐసీసీ సూచించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఆ నాలుగు జెండాల్లో ఒకటి ఐసీసీ, రెండోది పీసీబీది కాగా, మిగతా రెండు ఆ రోజు పోటీపడే జట్లకు సంబంధించిన దేశాలవని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆతిథ్య దేశంలో భారత జెండాకు స్థానం దక్కిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రోఫీలో పాల్గొనే దేశాల జెండాలన్నీ అక్కడ ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

చాంపియన్స్ ట్రోఫీ 2025కు వేళయింది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ పాకిస్థాన్ వేదికగా జరగనుంది. మొత్తం ఎనిమిది దేశాలు ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ రోజు నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
ఇక, ఈ రోజు నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కరాచీ నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత జట్టు కూడా ఈ టోర్నీ కోసం సిద్ధంగా ఉంది. గ్రూప్ దశలో కొన్ని కీలకమైన మ్యాచ్‌లు ఉండగా, అభిమానుల దృష్టి ప్రధానంగా భారత్ – పాక్ మ్యాచ్‌పైనే ఉంది. క్రికెట్‌ను ప్రేమించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇండో-పాక్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఆ మైదానంలో ఏం జరిగితేనేం, ఈ రెండు జట్ల పోరు ఉత్కంఠను కలిగించేదే.