డొమినికన్ రిపబ్లిక్‌లో వారం క్రితం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి సంబంధించిన దుస్తులు, చెప్పులు పుంటా కానా బీచ్‌లో లభ్యమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ దుస్తులు బీచ్‌లోని లాంజ్ కుర్చీ వద్ద గుర్తించబడ్డాయి. ఇసుకలో కూరుకుపోయిన దుస్తులు, పక్కనే ఉన్న లేత గోధుమ రంగు చెప్పులు సీసీ కెమెరా ఫుటేజీలో సుదీక్ష ధరించిన దుస్తులకు పోలి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిఘా కెమెరాల్లో ఆమెతో చివరిసారిగా కనిపించిన జోషువా రీబ్‌ను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అదృశ్యం కేసు
అమెరికాలోని వర్జీనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన 20 ఏళ్ల సుదీక్ష తన స్నేహితులతో కలిసి విహారయాత్రలో భాగంగా డొమినికన్ రిపబ్లిక్‌కు వెళ్లింది. మార్చి 6న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆమె కనిపించకుండా పోయిందని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పరిశీలించిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ అయిన 22 ఏళ్ల జోషువా రీబ్‌తో కలిసి ఆమె చివరిసారిగా బీచ్ దగ్గర కనిపించింది. మార్చి 6 తెల్లవారుజామున 4.15 గంటలకు ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ ఉన్నట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ సమయంలో వారితో పాటు సుదీక్ష స్నేహితులు కూడా ఉన్నారు.
జోషువా రీబ్‌పై అనుమానాలు
సుదీక్ష స్నేహితులు హోటల్‌కు తిరిగి వెళ్లగా, సుదీక్ష, రీబ్ మాత్రం బీచ్‌లో ఉండిపోయారు. అయితే, రిసార్ట్‌లో విద్యుత్ అంతరాయం కారణంగా నిఘా కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫుటేజ్ లభ్యం కాలేదు. విచారణలో రీబ్ పోలీసులకు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. తను ఆమెను అలల నుంచి రక్షించానని, అయితే ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని రీబ్ చెప్పాడు. దీంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అధికారికంగా అనుమానితుడిగా ప్రకటించలేదు.

కుటుంబ సభ్యుల ఆందోళన
మరోవైపు, రీబ్‌ను పోలీసులు అనుమానాస్పదంగా నిర్బంధించారని, అధికారిక అనువాదకుడు లేకుండానే విచారించారని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడిపై అన్యాయంగా ఒత్తిడి తెస్తున్నారనీ, ఈ కేసులో న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు.
గాలింపు చర్యలు ముమ్మరం
సుదీక్ష అదృశ్యమై 8 రోజులు గడుస్తుండటంతో పోలీసులు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఆమె ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. సుదీక్ష 5 అడుగుల 3 అంగుళాల పొడవు, నల్లటి జుట్టు, గోధుమ రంగు కళ్లతో ఉంటుందని పోస్టర్లలో పేర్కొన్నారు.