భారత్‌ ఎప్పుడూ బంగ్లాదేశ్‌ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి: ప్రధాని మోడీ

India is always a benefactor of Bangladesh’s progress: PM Modi

న్యూఢిల్లీ: నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తూ.. బంగ్లాదేశ్‌ లో హిందువుల సురక్షితపై భారతీయులు ఆందోళనలో ఉన్నారని మోడీ అన్నారు. ”బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. భారత్‌ ఎప్పుడూ బంగ్లాదేశ్‌ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణస్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల సురక్షితను భారత్‌ కోరుకుంటోంది” అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

పలు రంగాల్లో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ”మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉంది. దానిని నేను అర్థం చేసుకొంటాను. దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుంది” అని వెల్లడించారు.

”మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండాలని కోరుకోను. మధ్యతరగతి వర్గాలు పిల్లల విద్యపై ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెడుతున్నాయి. మన యువత ఇక్కడే చదువుకొనేలా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలి. విదేశీయులే ఇక్కడికి వచ్చి చదువుకొనేలా ఉండాలి. మనం బిహార్‌లో నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాం. కానీ, విద్యావ్యవస్థలో శతాబ్ధాల నాటి నలందా స్ఫూర్తిని తిరిగి నిలబెట్టాలి.” ”ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ ఆత్మనిర్భర్‌కు కీలక మంత్రం”మనం భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడమనేది లక్ష్యంగా ఉండాలి.’ అన్నారు.