పార్లమెంట్‌లో నిరసనకు సిద్ధమైన ఇండియా కూటమి

India Alliance ready to protest in Parliament

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2024-25పై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ పద్దులో విపక్ష రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్ష చూపిందని ఆరోపించాయి. బడ్జెట్లో ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని దుయ్యబట్టింది. గత పదేళ్లుగా దేశంలోని మధ్యతరగతి, పేదల ప్రజలకు జరుగుతున్న అన్యాయం పునరావృతమైందని విపక్షాలు మండిపడ్డాయి. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌ అని… మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టి వారికి మాత్రమే వరాలు కురిపించిందని లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

కేంద్ర వార్షిక బడ్జెట్లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా, వెలుపలా బుధవారం నిరసన తెలిపేందుకు రెడీ అయింది. కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఎన్డీఏ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరిస్తారని స్పష్టం చేశారు.