ప్రభుత్వానికి రూ.100 కోట్లు నుంచి రూ.150 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంటోందంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. బాటిల్‌పై కేవలం రూ.10 మాత్రమే పెంచినట్లు స్పష్టం చేసింది. ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ అంశంపై వివరణ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో తీసుకున్న అప్పుల్లో ఇప్పటికే రూ.12 వేల కోట్లు చెల్లించామని, ఇంకా రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో మద్యంలో అక్రమాలు జరిగాయని, ఇప్పుడు అన్నీ సరిదిద్దుతున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఏపీలో 150 కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి రవీంద్ర ప్రకటించారు. మద్యం నాణ్యత విషయంలో రాజీపడబోమని, అన్ని తనిఖీలు పూర్తయ్యాకే విక్రయాలను అనుమతిస్తున్నామని తెలిపారు. ఏఈఆర్‌టీ విధానంలో బాటిల్‌పై రూ.10 పెంచామని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్లు నుంచి రూ.150 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక రూ.99కు విక్రయిస్తున్న క్వార్టర్ బ్రాండ్లను మినహాయించి, మిగతా లిక్కర్ బ్రాండ్ల రేట్లను పెంచింది. క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్ల మీద అదనంగా రూ.10 పెంచినట్లు ప్రకటించింది.