తిరుమల : తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించగా.. తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా.. అర్థరాత్రి తిరుపతిలో హైడ్రామా చోటు చేసుకుంది..అభినయ రెడ్డి దాడి చేశాడని అంటున్నారు. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తన అనుచరులతో బీభత్సం సృష్టించిన అభినయ రెడ్డి… దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నందు ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేక పోవడం వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పట్టణం నందు 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.