గుజరాత్ కు మరో గండం

గుజరాత్ కు మరో గండం పొంచివుంది. ఇప్పటికే వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు 28 మంది వరకు మృతి చెందగా..కోట్లాది ఆస్థి నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగానే మరో పిడుగు లాంటి వార్త తెలిపింది వాతావరణ శాఖ. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో తుఫాన్‌గా మారబోతోంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర కోస్తా, ఉత్తర ప్రాంతాలు సహా గుజరాత్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణం కేంద్రం వెల్లడించింది.

ఇప్పటికే దేవభూమి ద్వారకా, ఆరావలి, పంచ్‌మహల్, రాజ్‌కోట్, జామ్ నగర్, మహీసాగర్, పోర్బందర్, ఖేడా, అహ్మదాబాద్, మోర్బీ, జునాగఢ్, భరూచ్, వడోదర జిల్లాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వారందరినీ సహాయ, పునరావాస శిబిరాలకు తరలించారు. ఒక్క వడోదరా జిల్లాలోనే 12,000 మందికి పునరావాసం కల్పించారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో అల్ప పీడనం అనే వార్త రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన ఉంటుందని, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు 11 జిల్లాలలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.