కూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వం’

కూటమి పాలనకు నేటితో 100 రోజులు పూర్తవడంతో 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో మ్మెల్యేలు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా DSC, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు, ‘ల్యాండ్ టైటిలింగ్’ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని చెపుతూ నేతలంతా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల ప్రభుత్వ సిబ్బంది తమ పరిధిలో ఇంటింటికీ వెళ్లి.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ ఏడు రోజులూ రోజుకో గ్రామం సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. వారికి ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఎంపిక చేసిన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పాలన గురించి వివరించాలి. తర్వాత ఆ గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి జనం నుంచి వినతులు స్వీకరించాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మొదటి రోజు శుక్రవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

కొన్ని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుస్తారు. తర్వాత గ్రామసభలో ప్రసంగిస్తారు. ఆయన తొలుత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాలని భావించారు. అక్కడ ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడాలనుకున్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం సాయంత్రం వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా వాతావరణం అలానే ఉంటుందని, హెలికాప్టర్లో పర్యటించేందుకు వాతావరణం అనుకూలించదని అధికారులు నివేదించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దయింది.