తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను అందరికీ నచ్చాలనుకోవడం లేదని, కొందరికి తన విధానాలు నచ్చవచ్చని, మరికొందరికి నచ్చకపోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కూడా కొందరు అంగీకరించకపోవచ్చని, అయితే ఎవరూ తనను తప్పుబట్టలేని విధంగా పాలనను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తా
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వారిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, అలాంటి విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగతానని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు
తన మంత్రివర్గ విస్తరణపై వ్యాఖ్యానించిన ఆయన, ఈ నిర్ణయం ఒక్కడిగా తాను తీసుకునేది కాదని, అది సమగ్ర చర్చల అనంతరం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో చేరారో, ఎవరి హయాంలో మంత్రులయ్యారో ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన పాలనలో పారదర్శకత ఉంటుందని, ప్రజలకు హాని కలిగించే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.