‘హైడ్రా’ దూకుడు.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు

సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌/ తహసీల్దార్‌.. దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా… ఆ మేరకు పలు ఇళ్లకు వాటిని అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇచ్చి, ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించడం గమనార్హం.