అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా

హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కూకట్ పల్లి లో కూల్చివేతలు ప్రారంభించింది. నల్ల చెరువు FTL, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గతకొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్​పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్లచెరువు మెుత్తం విస్తీర్ణం మెుత్తం 27 ఎకరాలు కాగా 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

అందులో 4 ఎకరాల బఫర్ జోన్‌లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లోని 3 ఎకరాల పరిధిలో 25 పక్కా భవనాలు, 16 తాత్కాలిక షెడ్లను నిర్మించి కొందరు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అక్కడ అధికారులు సర్వే నిర్వహించి వారందరికీ నోటీసులను ఇప్పటికే జారీ చేసి కూల్చివేతలను ప్రారంభించారు. అదేవిధంగా అమీన్‌పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ సర్వే నెంబర్ 164లో ఉన్న ఆక్రమణలను కూడా ‘హైడ్రా’ అధికారులు తొలగిస్తున్నారు.