హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం

హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నుండి పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రమంజిల్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, మాదాపూర్‌, బాలానగర్‌, మెహదీపట్నం, టోలిచౌకి, యూసఫ్‌గూడ, మాసాబ్‌ట్యాంక్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉదయం 6.40 గంటలకు ప్రారంభమైన వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట స్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్‌ నుంచి సుమారు కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ తెరిచి వరద నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో విధులకు వెళ్లేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లపైకి నీరు చేరడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.