గరిష్ట స్థాయికి చేరిన హుస్సేన్‌ సాగర్‌ నీటి మట్టం..లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక

Hussain Sagar has reached its maximum level..Warning for the people of lowland areas

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్త్నుయి. గత రాత్రి హైదరాబాద్‌లో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వరదనీటి కారణంగా పలు ప్రధాన రహదారులపై అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.