విజయవాడలో ఇన్సూరెన్స్ కోసం వరద బాధితుల భారీ క్యూ..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వ‌ర‌ద బాధిత ప్రజలకు సాధ్యమైనంత మేరకు పూర్తి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, వరదల వల్ల నష్టానికి గురైన వారు కోరిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని సూచించారు. దీంతో బాధితులు ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు.

విజయవాడ లో వందల కార్లు, వేల బైకులు, ఆటోలు, ట్రాలీలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండిపోయాయి. ఇప్పుడు వర్షాలు తగ్గి వరద నీరు వెనక్కు వెళ్ళిపోవడంతో అవి ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. బురదలోంచి బయటపడ్డ వాహనాలు నామరూపాల్లేకుండ పోయాయి. రంగులు పోయి, లొత్తలు పడిపోయి, అద్దాలు, డోర్లు పగిలిపోయి, సీట్లు నానిపోయి దారుణంగా తయారయ్యాయి. కొన్ని వాహనాలు అయితే అసలు మళ్ళీ నడుస్తాయా అన్నట్టు అయిపోయాయి. మరికొన్ని వాహనాలు వరదలో కొట్టుకు వెళ్ళిపోయాయి.

ప్రస్తుతం విజయవాడలో ఏ మెకానిక్ షెడ్ చూసినా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహకిల్సే. ముంపు ప్రాంతాలకు దగ్గరలో ఉన్న షాపులన్నీ రద్దీగా మారాయి. ప్రతి షెడ్‌ దగ్గరకు వందలాది వాహనాలు రిపేర్ కోసం వస్తున్నాయి.మరోవైపు వాటన్నింటినీ బాగుచేయలేక మెకానిక్‌లకు కూడా కష్టమయిపోతోంది. వరదలు, భూకంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ ప్రకారం బండిని బాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త బళ్ళు అయితే షో రూమ్‌ వాళ్ళే రిపేర్ చేయించి ఇస్తారని అంటున్నారు. ఇక బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వాటికి రిపేర్లు చేయించే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యామని తెలిపారు.