మమత వ్యాఖ్యలపై హిమంత ఫైర్

బెంగాల్ తగలబడితే అస్సాం, ఢిల్లీలో కూడా అవే పరిస్థితులు వస్తాయన్న సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు. ‘దీదీ.. అస్సాంనే బెదిరించడానికి మీకెంత ధైర్యం? మీ కోపం మాపై ప్రదర్శించకండి. రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశాన్ని తగలబెట్టాలని చూడకండి’ అని ధ్వజమెత్తారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంగళవారం జరిగిన అల్లర్లపై మమత ప్రస్తావించారు. రాష్ట్ర సచివాలయానికి నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది.

ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్‌జీ కార్‌ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. వెరసీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘‘మోడీ జీ.. మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని ఆమె అన్నారు. మమత వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు.