బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్‌ కోర్టు నోటీసులు

Himachal court notices to BJP MP Kangana Ranaut

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ కు హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి అయిన విక్రమాధిత్య సింగ్‌పై (కాంగ్రెస్‌) 74,755 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్‌కు చెందిన లాయక్‌ రామ్‌ నేగి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రనౌత్‌ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వచ్చే నెల 21లోగా వివరణ ఇవ్వాలంటూ రనౌత్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

అటవీ శాఖలో పనిచేసిన తాను.. ముందుగానే ఉద్యోగవిరమణ చేసినట్లు నేగి తన వ్యాజ్యంలో తెలిపారు. నామినేషన్‌ పత్రాలతో పాటే డిపార్ట్‌మెంట్‌ నుంచి పొందిన ‘నో డ్యూ సర్టిఫికెట్‌’ను జత చేసినట్లు వెల్లడించారు. కానీ, విద్యుత్తు, తాగునీరు, టెలిఫోన్‌ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్‌ అధికారి ఆదేశించినట్లు తెలిపారు. అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోగా తాను అన్నీ తీసుకెళ్లినట్లు చెప్పారు. వాటిని తీసుకోకపోగా.. తన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. నామినేషన్‌ పత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్‌ నేగి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.