‘హైడ్రా’పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

ts-high-court

సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ఫై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీవో 99 చట్ట బద్ధతను సవాల్​ చేస్తూ హైదరాబాద్ నానక్​రాంగూడకు చెందిన డి.లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.అమీన్​పూర్​ మండలం ఐలాపూర్‌లో 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చి వేసిందన్నారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో 99 తీసుకువచ్చిందని, ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు. చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనా పరమైన అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు. దీనిపై కోర్ట్ సీరియస్ అయ్యింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.