వైసీపీ నేతల పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

ap high court
ap high court

అమరావతి: చంద్రబాబు నివాసంపై గతంలో దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ తో పాటు పలువురు వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో రెండు వారాల పాటు తమ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైసీపీ నేతల తరఫున వాదిస్తున్న లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు అనుమతించాలని కోరారు. అయితే, దీనిపై విచారణ చేపట్టే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామంటూ జస్టిస్ మరో షాకిచ్చారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి జరిగింది. దీనిపై చంద్రబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా.. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేశ్, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ తదితర వైసీపీ నేతలు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.