Rains : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నేటి వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమైన రాష్ట్ర ప్రజలు వర్షాలు, చల్లని గాలులతో సేద తీరుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని చాలా చోట్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం కురిసింది. దర్పల్లిలోని వాడి గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో వరిధాన్యం నేలరాలింది.

నివారం కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఆ ఇంట్లోని సామాగ్రి ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షం పడింది. ఇక శనివారం కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయిన తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, రాగల మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సామాన్యంగా ఉండటంతో పాటు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది.