ముంబయిలో భారీ వర్షాలు..రెడ్‌ అలర్డ్‌ జారీ: ఐఎండీ

Heavy rains in Mumbai..Red alert issued: IMD

ముంబయిః ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. అయితే, మంగళవారం కూడా ముంబయి నగరంలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబయి, థానే, నవీ ముంబయి, పన్వెల్‌, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.

కాగా, ముంబయిని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కేవలం ఏడు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీటపై తేలాడాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ వర్షం రైలు, విమాన సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలను కూడా మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు భారీ వర్షాలకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా 72 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.