ముంబయిలో అతిభారీ వర్షాలు..రెడ్‌ అలర్డ్‌ జారీ

Heavy rains in Mumbai..Red alert issued

ముంబయి: మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ముంబయి, పుణేల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షపాతం నమోదవగా ఈ నగరాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

ముంబయి పుణే నగరాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఈ రెండు రోజులు ముంబయిలో స్కూళ్లు, విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు, బీఎంసీ అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఇటీవల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఉన్నతస్ధాయి సమావేశంలో వరద సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలపై డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో కలిసి సమీక్షించారు. పుణే ప్రాంతంలో భారీ వర్షాలతో వరద పోటెత్తిందని అక్కడ సహాయ, పునరావాస కార్యక్రమాలను తాను పర్యవేక్షిస్తున్నానని సీఎం వెల్లడించారు. ముంబయిలో ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైందని, తాను ముంబయి, పుణే, రాయ్‌గఢ్‌ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని సీఎం తెలిపారు.