మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్ప పీడన ప్రభావం తో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం తో పాటు పొరుగున ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో వ్యాపించి, దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం, ఇంకా దానిని ఆనుకొని ఉన్న ఉత్తర భాగంలో ఆగస్టు 29 నాటికీ.. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , శుక్రవారం .. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.