విజయవాడలో కుండపోతగా వర్షాలు..విరిగిపడుతున్న కొండచరియలు

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో ఎడతెగని వర్షం కురుస్తుండడం తో సున్నపు బట్టీల సెంటర్ లో మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే సహాయక చర్యలు ప్రారంభించారు. శిధిలాల కింద మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీలు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయిన పరిస్థితి.

అలాగే వన్‌టౌన్ పితాని అప్పలస్వామి స్ట్రీట్ వద్ద సపోర్ట్ గోడ మెట్లు కూలడంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్న వారు బయటకి రావడంతో ప్రమాదం తప్పినట్లైంది. డ్రైనేజీ నీరు ఇంట్లోకి రావడంతో రాత్రి నుంచి చిన్న పిల్లలు, మహిళలతో జాగారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా బెజవాడలో భారీ వర్షం నిన్నటి నుంచి కురుస్తుండటంతో అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అలెర్ట్ చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తో ఫోన్ లో మాట్లాడి కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.లోతట్టు ప్రాంతాలు,రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ లలో నీరు పారుదల కు ఆటంకాలు లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.