వరద గుప్పెట్లో మణుగూరు పట్టణం

అల్పపీడనం ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం నుండి మొదలైన వర్షాలు ..ఆదివారం వరకు అలాగే పడుతూనే ఉన్నాయి. ఇంకా వర్షం కురుస్తుండడం తో వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగిప్రవహిస్తున్నాయి. ఇక మణుగూరు పట్టణం వరద గుప్పెట్లో చిక్కుకుంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మణుగూరు పట్టణం వరద ముంపునకు గురైంది. సుందరయ్య నగర్, ఆదర్శనగర్, చాకలి ఐలమ్మ నగర్, పైలట్ కాలనీ, కాళీమాత ఏరియా, అశోక్ నగర్, సాయి నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

దీంతో స్థానికులు రాత్రంతా భయం గుప్పెట్లో గడిపారు. మణుగూరు పట్టణంలో రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశోక్ నగర్​లో వరద నీటిలో చిక్కుకున్న గర్భిణీ స్త్రీని, వృద్ధులను రెస్క్యూ బృందం బోటు సాయంతో వెళ్లి రక్షించింది. వర్ధమాంబ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించి, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఇటు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎక్కమేడ్ గ్రామంలో ఇల్లు కూలిపోయి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకుమార్తె మృతి చెందారు. మృతులు హన్మమ్మ (70), ఆమె కుమార్తె అంజిలమ్మ (35) అని స్థానికులు తెలిపారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే..హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నిన్న ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మధ్యలో కాస్త తెరిపి ఇచ్చి తిరిగి వర్షం కురిసింది. మరోసారి రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురిసింది.

సికింద్రాబాద్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, తార్నాకా ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. మరికొన్ని వాహనాలను నార్కట్‌పల్లి, అద్దంకి వైపు మళ్లించారు. వర్షాల కారణంగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.