తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ ప్రజలకు భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. రాగల ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,భూపాలపల్లి,కరీంనగర్, కొమురంభీం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదివారం హైదరాబాద్‌ లో రాత్రి భారీ వర్షం కురిసింది. యూసుఫ్‌గూడలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాంనగర్, కృష్ణానగర్‌లో కార్లు కొట్టుకుపోయాయి. నగర వ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు భారీ వర్షం కురవడంతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు కాగా…. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీటి మట్టం 513.210 మీటర్లకు చేరుకుంది.

దీంతో అప్రమత్తమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇక పరిస్థితిని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. వరదల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.