భయం గుప్పట్లో ఖమ్మం..

ఖమ్మం రూరల్ మండలాల పరిధిలోని మున్నేరు ముంపు గ్రామాల ప్రజలు క్షణం క్షణం భయపడుతూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన వచ్చిన మున్నేరు వరదల్లో ఇళ్లు మునిగి ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడు మళ్లీ మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం కవిరాజు నగర్, బొక్కల గడ్డ, మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ధంసలపురం ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల, స్వర్ణభారతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వారిని తరలించారు.

మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హుటాహుటిన ఖమ్మం బయల్దేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్నేరు వాగుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. భారీ వరద పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్​ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.