శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు … 10 గేట్లు ఎత్తివేత

Heavy flood water for Srisailam project… lifting of 10 gates

హైదరాబాద్: కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల డ్యామ్ ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

స్పిల్ వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాగా, ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జలవిద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి, దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు 64,338 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.