నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Hearing on MLC Kavitha’s bail petition today

న్యూఢిల్లీ : నేడు సుప్రీంకోర్టులో లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరఫు అడ్వకేట్లతో సమావేశమయ్యారు.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నింటినీ ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడీషియల్ కస్టడీని ఎప్పటికప్సుడు పొడిగించింది. ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ కోర్టు.

ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు విచారణ చేపట్టనుంది. ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. కవిత బెయిల్ పిటీషన్‌కు వ్యతిరేకంగా ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వేరేగా ఉంటోన్నాయి. మనీ లాండరింగ్‌లో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే కవితకు చెందిన 100 కోట్ల రూపాయలను అటాచ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.