నేడు సుప్రీంకోర్టులో కేజీవాల్‌ పిటిషన్ల పై విచారణ

Hearing on Arvind Kejriwal petition in the Supreme Court today

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఈరోజు (గురువారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌ కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లును విచారించే అవకాశం ఉన్నది. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఆగస్టు 23 వరకు అనుమతి ఇచ్చింది. కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్‌కు రెండురోజుల గడువు ఇచ్చింది.

బెయిల్‌, సీబీఐ తనను అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. తన అరెస్టును సమర్థిస్తూ ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్‌ చేశారు. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్‌ కస్టడీలో రిమాండ్‌లో ఉన్న సమయంలోనే జూన్‌ 26న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఈడీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను ఇవ్వగా.. సీబీఐ కోర్టులో ఈ నెల 14న మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఊరట కల్పిస్తుందా? లేదా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.