న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. ఎన్నికల సంఘం ఆమోదం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
డేరా బాబాకు హర్యానాలో లక్షలాది మంది అనుచరులున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఈ ఎన్నికలపై పెను ప్రభావం పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పెరోల్ సమయంలో ఆయన హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా లేదా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వీలుండదని సమాచారం. కాగా, ఎన్నికల సంఘం నిర్ణయంతో డేరా బాబాకు తొమ్మిది నెలల్లో పెరోల్ లభించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక గత నాలుగేళ్లలో 15వ సారి.