హైదరాబాద్: పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల పండుగ..బతుకమ్మ పండుగను అందరూ సంబురంగా జరుపుకోవాలని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందించాలని ఆకంక్షిస్తున్నానని అన్నారు. ఈ సందర్బంగా ఆడపడుచులందరికీ హరీష్ రావు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే, ప్రకృతితో మమేకమయ్యే సంబరం… బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ప్రతి యేటా భాద్రపద అమావాస్య… అంటే మహాలయ అమావాస్య (పెతర మాసం) నాడు ప్రారంభమవుతాయి. ఈ సంబరాల్లో బతుకమ్మలను రోజుకో పేరుతో కొలుస్తారు. పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి, తమలపాకులు ఉంచి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు. ఈ తొమ్మిది రోజులూ రకరకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అలంకరణ కోసం ముందురోజే రకరకాల పువ్వులు కోసుకొని తీసుకొచ్చి, నీళ్ళలో వేస్తారు. మర్నాడు వాటితో బతుకమ్మను అలంకరిస్తారు. అందుకే ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అంటారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఇది ప్రకృతితో మమేకమైన పండుగ. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జానపద పాటలతో ఆడుతూ పాడుతు చేసుకునే గొప్ప పండుగ. తెలంగాణలోని ప్రతి గ్రామం రంగురంగుల పూలతో సుందరంగా మారుతోంది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర పండుగ అయిన ‘బతుకమ్మ’ ఉత్సవాలు జరుపుకునేందుకు తెలంగాణ ఆడపడుచులు సిద్దమయ్యారు. తెలంగాణలోని పల్లెల్లో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తారు. పెళ్లైన ఆడవాళ్లు పుట్టింటికి వచ్చి బతుకమ్మను జరుపుకుంటారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబురాలు అని ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రన్సిపాల్ మెర్సి వసంత అధ్యక్షతన బతుకమ్మ సంబురాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ పేరు చెప్పగానే బతుకమ్మ పండుగ గుర్తుకు వస్తోందన్నారు. ఇంది దేశంలోనే అరుదైన పూల పండుగ అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, కౌన్సిలర్లు శిరీస చెన్నారెడ్డి, ఎండీ సలీం, మహేష్‌కుమార్, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజ్, సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్ పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థుల వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆడిపాడారు.