షేక్‌ హసీనాను అప్పగించండి : భారత్‌కు బంగ్లాదేశ్‌ పార్టీ డిమాండ్‌

Hand over Sheikh Hasina: Bangladesh party demand to India
Hand over Sheikh Hasina: Bangladesh party demand to India

ఢాకా: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ ను నిప్పుల కుంపటిగా మార్చడంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి షేక్‌ హసీనా ఆ దేశాన్ని విచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెపై బంగ్లాలో హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్‌ పార్టీ ఢిల్లీని డిమాండ్‌ చేసింది.

”మన పొరుగుదేశం ఆమెకు ఆశ్రయం కల్పించడం విచారకరం. అక్కడినుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. హసీనాను మీరు (భారత్‌ను ఉద్దేశిస్తూ) న్యాయబద్ధంగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలి. పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు మా దేశ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెను విచారణ ఎదుర్కోనివ్వండి” అని బీఎన్‌పీ పార్టీ సెక్రటరీ జనరల్‌ మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగిర్‌ పేర్కొన్నారు.

రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. వారి కుటుంబసభ్యుల మరణాలకు హసీనా నే కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశాయి. దీంతో మాజీ ప్రధాని, ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు హసీనాపై 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 హత్య అభియోగాలపైనే నమోదవడం గమనార్హం. మారణహోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై నాలుగు కేసులు.. కిడ్నాప్‌నకు సంబంధించి మరో కేసు నమోదైంది.

ఆమెతో పాటు హసీనా కుమారుడు సాజీద్‌ వాజెద్‌ జాయ్‌, కుమార్తె సైమా వాజెద్‌, సోదరి షేక్ రెహానాను కూడా ఈ హత్య కేసుల్లో సహ నిందితులుగా పేర్కొన్నట్లు బంగ్లా పోలీసులు వెల్లడించారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.